డీలర్లకు తరుగుల చిల్లు - గోదాముల ఇన్‌ఛార్జిలకు జేబులు ఫుల్లు..! 2 m ago
8కే న్యూస్, అమరావతి
రాష్ట్రంలోని ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో వంద శాతం తూకం వేసి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా గత ఐదేళ్లుగా ఈ తంతు ఎక్కడా జరగడం లేదనే విమర్శలు డీర్లనుండి వెత్తుతున్నాయి. బియ్యం తరుగుదల రూపంలో ఏటా సుమారు రూ. 300 కోట్ల విలువగల బియ్యం పక్కదారి పడుతున్నట్లు అంచనా. రాష్ట్రంలో 266 ఎమ్ఎల్ఎస్ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 2.2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 29 వేల రేషన్ షాపులకు సరఫరా అవుతాయి. నిబంధనల ప్రకారం ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో బియ్యం వంద శాతం తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే, గత ఐదేళ్లుగా ఎక్కడా బియ్యం తూకం వేసి డీలర్లకు సరఫరా చేసిన ఘటనలు లేవని చెబుతున్నారు. ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో బస్తా నికరం 50 కేజీలు తూకం వేసి డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే, తూకం విధానం లేకపోవడంతో 50 కిలోల టిక్కీకి కనీసం కిలో నుండి రెండు కిలోల వరకూ బియ్యం తూకం తక్కువగా వస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో బియ్యం తక్కువగా వస్తున్నా డీలర్లు కిమ్మనకుండా తీసుకెళ్లాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఒక్కో చోట బియ్యం టిక్కీకి మూడు నుండి నాలుగు కేజీల తరుగు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే నెలకు సుమారు 50 లక్షల కిలోల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం తరుగులు వస్తున్నట్లు అంచనా.
రాష్ట్ర విభజన అనంరతం రేషన్ డీలర్లు అప్పటి ప్రభుత్వానికి బియ్యం తూకం విషయమై పలుమార్లు విన్నవించడం జరిగింది. డీలర్ల వినతుల మేరకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో ఈ పోస్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోదాముల నుండి ఎమ్ఎల్ఎస్ కేంద్రాలకు వచ్చే బియ్యం తూకాలు వేసేందుకు కొన్ని చోట్ల వే బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రోజులు అవి సజావుగానే నడిచాయి.
అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలోని ఈ పోస్ మిషన్లను రిపేరు పేరుతో మూలన పెట్టినట్లు డీలర్లు చెబుతున్నారు. దీంతో గత ఐదేళ్లుగా ఎమ్ఎల్ఎస్ కేంద్రాల నుండి తూకం లేకుండానే బియ్యం రేషన్ షాపులకు సరఫరా చేయడం జరిగింది. అయితే, ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో తూకం వేయకపోవడంతో తరుగుల కారణంగా సహజంగానే రేషన్ షాపుల్లో బియ్యం టిక్కీల్లో తూకంలో తేడాలుంటాయి. అప్పుడప్పుడు తనిఖీలకు వచ్చిన అధికారులు రేషన్ షాపుల్లోని బియ్యం నిల్వలను తూకం వేసి తరుగులు వచ్చాయనే నెపంతో కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. తరువాత డీలర్లపై భారీ ఎత్తున పెనాల్టీలు వేయడం జరుగుతుంది. డీలర్లకు తరుగులు ఇచ్చిన బియ్యాన్ని ఎమ్ఎల్ఎస్ కేంద్రాల ఇన్‌ఛార్జిలు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, ముఠా కార్మికులు కలిసి వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్ఎల్ఎస్ కేంద్రాల ద్వారా పక్కదారి పడుతున్న బియ్యాన్ని అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఎమ్ఎల్ఎస్ కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బియ్యం నిల్వలను తూకాలు వేయగా భారీగా హెచ్చు తగ్గులు ఉన్న ఘటనలు కూడా రాష్ట్రంలో పలుచోట్ల చోటుచేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే ఎమ్ఎల్ఎస్ కేంద్రాల ద్వారా తరుగుదల కారణంగా ఏటా సుమారు రూ. 300 కోట్ల వరకూ విలువ గల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 1,500 కోట్ల విలువగల రేషన్ బియ్యం పక్కాగా పక్కదారి పట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ పోస్ మిషన్లకు మరమ్మతులు చేసి డీలర్లకు వంద శాతం తూకంతో బియ్యాన్ని సరఫరాచేసి ఎమ్ఎల్ఎస్ కేంద్రాల్లో జరిగే తరుగదలకు చెక్ పెట్టాల్సిందిగా రేషన్ డీలర్లు కోరుతున్నారు.
కాగా, బుధవారం విజయవాడలో జరగనున్న ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సమాఖ్య సమావేశంలో వంద శాతం బియ్యం తూకాన్ని వేసి సరఫరా చేయాల్సిందిగా డీలర్లు ప్రభుత్వాన్ని కోరనున్నారు.